Thursday, 23 January 2014

విదేశీ వ్యామోహం - నిరుద్యోగ భారతం

విదేశీ వ్యామోహం - నిరుద్యోగ భారతం


దేశంలో ధనికులనుంచి,  సామాన్యుడి ఇంట్లో సైతం, వాడుకలో ఉన్న లక్జరికార్లు, బైకులు, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్లు, కంప్యుటర్ పరికరాలు   టివిలు,రిఫ్రిజిరేటర్లు, వంటివన్నీ, ఎక్కడనుంచి తయారైనవి వాడుతున్నామో పరిశీలిస్తే, ఈ దేశంలో నిరుద్యోగులు ఎందుకు పెరుగుతున్నారో అర్ధమవుతుంది. 

విదేశీవస్తువుల వాడుకే, స్టేటస్ సింబల్గా  మార్చివేసినధనికవర్గాలు, సగటు జనానికికూడా, ఆ వేలంవెర్రి, వేళ్ళునుకునేలా పెంచేసారు. 

దేశీయ ధనాన్ని, విదేశాలకు నిలువు దోపిడీ సమర్పించుకుంటున్నామన్న ఆలోచన లేకుండా, మనదేశపు,ఉత్పాదక, ఉపాధిరంగాలని , మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఫలితంగా, ఈ దేశపు,యువతను నిరుద్యోగులుగా నిర్వీర్యం చేస్తూ, విదేశీ కూలీలుగా మారేందుకు,ఉరకలెత్తేలా, ప్రోత్సహించటం శోచనీయం.

 శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువతకు ఆసక్తిని  పెంచి, నిపుణులుగా ఎదిగేందుకు ప్రయత్నిద్దాం. యువతరం సృజనతో రూపొందించే సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సాహిద్దాం. భారత యువ'శక్తి'ని ప్రపంచమంతా చాటుదాం.          

Monday, 20 January 2014

డబ్బా (డబ్బు) నీరు !

డబ్బా (డబ్బు) నీరు !


ప్రకృతిపరంగా లభించే జీవనాధారమైన మంచినీటిని, కొనుక్కుని త్రాగాల్సిన దుస్తితేనా అభివృద్ధి? ప్రకృతినుంచి దూరమవటమే, నాగరికత అయితే, వికృతికి బలికావాల్సి వస్తుంది. భవిష్యత్ తరానికి మంచినీటిని కూడా అందించలేని, ఈ విపరీత ధోరణికి ఎవరు కారణం?
ఈ వ్యాపార దోపిడీని నేర్పిన బహుళజాతి విదేశీకంపెనిలా? వాటికి గుడ్డిగా 
దాసోహమన్న రాజకీయ పాలకులా? అన్నింటిని మౌనంగా భరిస్తూ, వెర్రిగా అనుసరిస్తున్న జనమా? {మనమా?} ఇప్పటికైనా ఆలోచిద్దాం,
అనాలోచిత అనుకరణలకు స్వస్తి పలుకుదాం.

Sunday, 19 January 2014

ఈ దేశ విద్యా విధానం ఏమైపోయింది..?

ఈ దేశ విద్యా విధానం ఏమైపోయింది..? 

ప్రపంచ ఆర్దిక వ్యవస్థకు మూలమైన ఎన్నో విషయాలు భారత ప్రాచీన విద్యా విధానం ద్వారా రూపొందినవే. సున్నా (జీరో) కనుగొనటం నుంచి రాజనీతి శాస్త్రం వరకు ఎన్నింటినో మన పూర్వీకులు స్పష్టమైన వివరాలతో భావితరాలకి అందించారు. అద్భుత కట్టడాలను అలవోకగా నిర్మించిన ఇంజనీరింగ్ ప్రతిభ అప్పటికే మన సొంతం. అరవైనాలుగు కళలలో ఆరితేరిన నైపుణ్యం భారతీయులది. ఖగోళ విజ్ఞానం, సూర్య, చంద్ర, నక్షత్ర గమనాలను లెక్కలు కట్టి పౌర్ణమి , అమావాస్య, గ్రహణాలను చెప్పిన చరిత్ర మనది.
అయితే బ్రిటీష్ వారి బానిసత్వంలో మనదేశంలోకి విదేశీ విద్యావిధానం చొరబడింది. మంచి ఎక్కడున్నా నేర్చుకోవటం తప్పుకాదు. కానీ మన ఉనికి మరచి వాళ్ళ విధానాలకు ఆకర్షితులయ్యాము. ఫలితంగా విద్య ద్వారా విజ్ఞానవంతులయ్యే పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. చదువుతో సంస్కారం, విజ్ఞానం, మానవతా విలువలు నేర్చుకునే పధ్ధతి ఎప్పుడో వదిలేసాము. చదువంటే పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన డిగ్రీలు సాధించే వ్యవస్థగా మార్చుకున్నాము. 

Friday, 10 January 2014

భారతదేశ కీర్తి

భారతదేశము గొప్ప చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలు, సహజ వనరులు, మానవ వనరులు కలిగి ఉన్న సమర్ధవంతమైన, సుసంపన్నమైన  పెద్ద దేశము. 

అనేకమంది ఈదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు, ఇక్కడి సంపదను దోచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి, శ్రీ కృష్ణుని గీతా సారం, ఋషి పరంపరలో స్వధర్మ ఆచరణకు, చేతులెత్తి నమస్కరిస్తూ, భారతదేశ కీర్తిని ప్రపంచం మొత్తం ప్రచారం చేశారు. 

బ్రిటీషు ఏలుబడిలో మనల్ని బానిసలుగా చూసినా,  మన వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించారు. వాటిపై అధ్యయనం చేసి, మానవ మనుగడకు, జీవనానికి, అభ్యున్నతికి అవసరమయ్యే అన్ని విషయాలను, వీటిలో పొందుపరచినట్లు గుర్తించారు. వాటిని తమ దేశాల్లోని జీవన విధానాలతో అనుసంధానం చేసి అమలు చేసేందుకు శతాబ్దాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.  
అటువంటి మహత్తర శక్తివంతమైన ఈదేశ స్వధర్మాన్ని, మనం చేజేతులా వదిలేసి, పరదేశపు అజ్ఞాన పూరిత, విచక్షణారహిత విధానాలవైపు ఆకర్షితులవటం, బాధాకరమైన విషయం.